Tuesday, 26 June 2012

ముందుమాట

ముందుగా ఒక మాట!

ఓం శ్రీ గురుభ్యో నమః

రుద్రాధ్యాయము నేర్చుకోవాలని నేను చేస్తున్న ప్రయత్నములో భాగముగా, తరువాత పోస్టులో తెలిపిన గ్రంధముల ఆధారముగా నమకమునకు తెలుగులో వ్రాసుకున్న సంగ్రహమైన అర్ధములను ఈ బ్లాగులో పొందుపరస్తున్నాను. పెద్దలు వ్రాసిన సద్గ్రంధములను వినయముతో అధ్యయనము చేస్తుంటే, అలా అధ్యయనం చేసినవాటిని మహాత్ముల బోధలు, లీలలతో సమన్వయము చేసుకొని మననము చేసుకుంటుంటే, అలానే మనకు అవగతమైనంతమేరకు ఆచరించడము ప్రారంబిస్తే, అప్పుడు సద్గురువుయొక్క అనుగ్రహమువలన వేదమంత్రముల హృదయము మరింత విస్తారముగా, లోతుగా, ఆచరణ యోగ్యముగా అనుభవైక వేద్యమవుతుందని పెద్దల ఉవాచ!అలాకాక, కేవలము సంగ్రహమైన పైపై అర్ధములను తెలుసుకోవడముతోనే ఆగిపోతే పరిమితమైన ప్రయోజనముమాత్రమే సిద్ధిస్తుంది.

ఇక్కడ వ్రాసుకున్నవాటిలో ఏమైనా తప్పులు (అక్షర దోషములు, పద దోషములు, అర్ధ దోషములు మొదలగునవి ఏమైనా) మీ దృష్టికివస్తే దయతో తెలియజేయగలరు. తప్పక సరిజేసుకుంటాను. దీనికి సంబందించిన మీ సలహాలనుకూడా దయతో తెలియజేయగలరు.

ఓం శ్రీ గురుభ్యో నమః


ఉపకృత గ్రంధాలు


ఉపకృత గ్రంధాలు

రుద్రాధ్యాయముయొక్క భావమును తెలుగులో సంగ్రహముగా వ్రాసుకొనుటకు నాకు ఉపకరించిన గ్రంధములు, మరియు ఇంటర్‌నెట్‌లోగల తత్సంబంధమైన ఇతర వనరుల వివరములను ఇచట పొందుపరచుచున్నాను.

1. బ్రహ్మశ్రీ మల్లాప్రగడ చిన్న రామలింగేశ్వరరావుగారిచే ఇంగ్లీషులో వ్రాయబడిన: "Rudra-adhyaaya: also known as Namaka-chamaka, with critical notes and an advaitic Commentary in English" అను పుస్తకము.  ఈ గ్రంధమును 1975లో అను-ప్రకాశన్-పబ్లికేషన్స్, మీరట్‌వారు ముద్రించినారు. ఇపుడు ముద్రణలో ఉన్నట్టులేదు: http://amzn.com/B0007ANH9Y
ఎవరికైన ఈ గ్రంధముయొక్క లభ్యత గురించి మరిన్ని వివరములు తెలిసినచో దయతో తెలుపగలరు. స్కాన్ చేయబడిన పై పుస్తకమును, PDF ఫార్మాట్‌లో ఈ క్రింది లింకువద్దనుండి డౌన్‌లోడ్ చేసుకొనవచ్చును:
 పై పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం కుదరకపోయినచో నాకు ఈ-మెయిలు పంపగలరు.

2. బ్రహ్మశ్రీ తెలికిచెర్ల రాజేశ్వరశర్మగారు "శ్రీ రుద్రాభిషేక మహాత్మ్యము" అను పేరుతో నమక చమకములకు భాష్యమును తెలుగులో రెండు భాగములగా వ్రాసినారు (మొత్తము 1088 పేజీలు!). సంస్కృతమునందుగల విద్యారణ్యభాష్యము, భట్ట భాస్కరభాష్యము, విష్ణుసూరిభాష్యము మొదలగువానిని అధారముగాచేసుకుని వీరు ఈ రచనను గావించిరి. ఈ గ్రంధము ప్రధమముగా 1982లో ప్రచురింపబడినది. ఇపుడీగ్రంధము ముద్రణలో ఉన్నదో లేదో తెలియదు. స్కాన్ చేయబడిన పై పుస్తకమును, PDF ఫార్మాట్‌లో ఈ క్రింది లింకువద్దనుండి డౌన్‌లోడ్ చేసుకొనవచ్చును:

3. శ్రీ స్వామి కృష్ణానందగారు (డివైన్ లైఫ్ సొసైటీ) ఇంగ్లీషులో శతరుద్రీయముపై వ్రాసిన వ్యాఖ్యానమును ఈ క్రింది లింకువద్ద చదువుకొనవచ్చును:

4. రుద్రాధ్యాయమును సుస్వరముగా మరియు భావయుక్తంగా నేర్చుకోవాలనే అబిలాష ఉన్నవారికి, పుట్టపర్తి శ్రీ సత్యసాయిబాబావారి ట్రస్టుచే రుపొందింపబడిన ట్యుటోరియల్ ఎంతగానో ఉపయోగపడగలదు. దానికి సంబంధించిన ఆడియో మరియు PDF లను ఈ క్రింది పేజీనుండి డౌన్‌లోడ్ చేసుకొనవచ్చును:

5. నమకమును తెలుగు-లిపిలో ఈ క్రింది లింకు వద్దనుండి PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకొనవచ్చును:
http://www.vignanam.org/veda/sri-rudram-namakam-shuddhatelugu.html

6. నమకమును సంస్కృత-లిపిలో ఈ క్రింది లింకు వద్దనుండి PDF ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకొనవచ్చును:

7. నమకమును యుట్యూబ్‌లో వినుటకు - 
మొదటి భాగము: http://youtu.be/jP6k1YXMYgE
రెండవ భాగము: http://youtu.be/daKLLVqMVUM
మూడవ భాగము: http://youtu.be/_k2g7zHgI0U

శ్రీ రుద్రం 1వ అనువాకం

శ్రీ రుద్రం 1వ అనువాకం

 ఓం నమో భగవతే’ రుద్రాయ ||
రుద్ర భగవానునికి నమస్కారము. (ధుఃఖములను, పాపములను నశింపజేయు వానికి నా నమస్కారము.)

ఓం నమ’స్తే రుద్ర న్యవ’ తో ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముతే నమః’ ||
ఓ రుద్రా! నీ కోపమునకు (నా) నమస్కారము. నీ బాణములకు (నా) నమస్కారము. నీ ధనస్సుకు (నా) నమస్కారము. నీ యొక్క రెండు బాహువులకూ కూడా (నా) నమస్కారము. 

యా ఇషుః’ శివత’మా శివం భూవ’ తే ధనుః’ | శివా శ’వ్యా’ యా త తయా’ నో రుద్ర మృడయ ||
పరమ మంగళకరమైన నీ బాణము ఏదైతే ఉన్నదో, మంగళకరమైన నీ ధనస్సు ఏదైతే ఉన్నదో, మంగళకరమైన నీ అమ్ములపొది ఏదైతే ఉన్నదో, వాటన్నింటితోనూ, ఓ రుద్రా, మాకు ఆనందాన్ని ప్రసాదించుము.

యాతే’ రుద్ర శివా నూరఘోరా‌உపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి ||
ఓ రుద్రా, మంగళకరమైన నీ శరీరం ఏదైతే ఉన్నదో, అఘోర రూపమైన (అహింసాత్మకమైన) మరియు ధుఃఖాన్ని కలిగించని నీ శరీరం ఏదైతే ఉన్నదో,  ఆ అనందాన్ని ప్రసాదించే శరీరంతో మమ్ములను ఆశీర్వదించుము.

యామిషుం’ గిరిశంస్తే బిర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్||
ఓ రుద్రా! నీ చేతిలో ఉపయోగించడానికి (సిద్ధంగా) ఏదైతే బాణాన్ని ధరించియున్నావో, దానిని (కేవలం) మాకు శుభములను కలుగజేయుటకు ఉపయోగించుము. మనుష్యలకును, ఇతర జీవులకునూ కష్టములను కలిగించకుము.

శివే వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నఃర్వమిజ్జగ’దక్ష్మగ్‍మ్ సునా అస’త్ ||
ఓ రుద్రా! నిన్ను పొందుటకు, మంగళకరమైన వాక్కులతో నిన్ను ప్రార్ధించుచున్నాము. (నీ వలన) ఈ జగత్తు అంతయూ రోగ  రహితముగనూ, మంచి మనస్సుతో కూడినదియునూ అగుగాక.

అధ్య’వోచదధిక్తా ప్ర’మో దైవ్యో’ భిషక్ | అహీగ్’‍శ్చ సర్వాం”మ్భన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ ||
అందరిలో ప్రథముడవైన దైవము, వైద్యుడవు అయిన నీవు మా తరఫున ఉదారముగా మాట్లాడుము. సర్పములు, రాక్షసులు మొదలగు వానిని నశింపజేయుము.

సౌ యస్తామ్రో అ’రుభ్రుః సు’ఙ్గళః’ | యే చేమాగ్‍మ్ రుద్రా భితో’ దిక్షు శ్రితాః స’హస్రశో‌உవైషాగ్ హేడ’ ఈమహే ||
 ఏ రుద్రుడు, ఉదయ కాలమున తామ్ర వర్ణముతోనూ, ఆపై అరుణ వర్ణముతోనూ, ఆ తరువాత పింగళ వర్ణముతోనూ  ఉన్న సూర్యునిగా ప్రకాశిస్తూ సర్వ మంగళములను కలిగించుచున్నాడో; సహస్ర సంఖ్యాకులైన  ఏ రుద్రులు భూమండలముయొక్క అన్ని దిక్కులయందునూ వ్యాపించియున్నారో,  వారు తమ తీక్షణతను (మాయందు) ఉపసంహరించుకోమని ప్రార్ధించుచున్నాను.

సౌ యో’‌உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | తైనం’ గోపా అ’దృన్-నదృ’శన్-నుదహార్యః’ | తైనం విశ్వా’ భూతానిదృష్టో మృ’డయాతి నః | 
నీలకంఠుడు అయిన రుద్రుడు రక్త వర్ణాన్ని కలిగిన కాల స్వరూపుడైన సూర్యునిగా ప్రకటమగుచున్నాడు. అలా వ్యక్తమైన రుద్రుడు పశువులను కాచుకొను గోపాలులచే, నదులనుండి నీటిని గొనివచ్చు స్త్రీలచే,  మరియు సర్వ జీవులచే చూడబడుతున్నాడు.  ఆ రుద్రుడు మమ్ములనందరినీ సుఖవంతులను గావించుగాక.

నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షా మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నో‌உహం తేభ్యో’‌உకన్నమః’ ||
నీలకంఠుడూ, (ఇంద్ర రూప ధారణముచే) సహస్రాక్షుడూ, ప్రార్ధనలను నిరంతరమూ మన్నించువాడునూ అగు ఆ రుద్రునకు మా నమస్కారములు అందుగాక. అంతేగాక, రుద్రుని సేవకులందరందరకీ నేను నమస్కరించుచున్నాను.

ప్రముం’ ధన్వ’స్-త్వముయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తేస్త ఇష’వఃరా తా భ’గవో వప | |
హే భగవాన్, మీ ధనస్సునకు రెండు వైపులా కట్టి ఉన్న ఆ వింటి త్రాటిని విప్పివేయుము. నీ చేతిలో (ప్రయోగించుటకు సిద్ధముగానున్న ఆ) బాణములను దూరముగా ఉంచుము.

త్యనుస్త్వగ్‍మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ ల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ ||
సహస్రాక్షములను, వందలాది అమ్ములపొదులను కలిగియున్న ఓ రుద్రా! నీ యొక్క ధనస్సును క్రిందకు దించి, నీ బాణములయొక్క మొనలను మొద్దుబారినవిగా చేయుము. మాపట్ల మంగళకరుడవు, అనుగ్రహయుక్తుడవు కమ్ము.

విజ్యం ధనుః’ కర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ త | అనే’న్-నస్యేష’వ భుర’స్య నిఙ్గథిః’ ||
జటాజూటధారివగు ఓ రుద్రా, నీ దనస్సును వింటి త్రాడు లేనిదిగా చేయుము. అంతేగాక,  నీ అమ్ములపొదిని బాణములు లేనిదానిగా చేయుము. బాణములను అసమర్ధములైన వానిగా చేయుము. నీ ఖడ్గపు ఒర కేవలము ఖడ్గమును మోయుటకు మాత్రమే పనికివచ్చునట్లు (కేవల అలంకార ప్రాయమైనదానిగా) చేయుము.

యా తే’ హేతిర్-మీ’డుష్ట హస్తే’ భూవ’ తే ధనుః’ | తయా‌உస్మాన్, విశ్వస్-త్వమ’క్ష్మయా పరి’బ్భుజ ||
అందరి కోర్కెలను విశేషముగా తీర్చువాడవగు ఓ రుద్రా!  నీ చేతులయందుగల ధనస్సు మొదలైన ఏ ఆయుధములైతే కలవో, వాని  సహాయముతో మమ్ములను అన్నివిధములుగా, ఎట్టి ఉపద్రవములు వాటిల్లకుండా పరిరక్షించుము.

నమ’స్తే స్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | భాభ్యా’ముతే నమో’ బాహుభ్యాం ధన్వ’నే ||
స్వరూపముచేత చంప సమర్ధమైనట్టివి, (కానీ ఇప్పుడు) ధనస్సునందు సంధింపబడనివియగు నీ ఆయుధములకు నమస్కారములు. నీయొక్క బాహు ద్వయమునకు, మరియు నీ ధనస్సునకు సైతము నమస్కారము.

పరి’ తే ధన్వ’నో హేతిస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే స్మన్నిధే’హి తమ్||
నీయొక్క ధనుర్భాణములు మమ్ములను అన్ని దిక్కులనుండి రక్షించుగాక, మరియు నీయొక్క అమ్ములపొదిని మానుండి దూరముగా ఉంచుము.

నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీకణ్ఠాయ’ మృత్యుంయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవా నమః’ ||
విశ్వమంతటికీ ప్రభువు, దేవాధిదేవుడు, ముక్కంటి,  మూడు పురములను నాశనము చేయువాడు, ప్రళయములో మూడు లోకాలను నశింపజేయు అగ్నిని హరించువాడు, కాలము అనే అగ్నినికూడా నశింపజేయువాడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వులకు ప్రభువు, ఎల్లప్పుడూ మంగళములనే కలిగించువాడు అగు ఆ మహాదేవునకు నమస్కారము.

శ్రీ రుద్రం 2వ అనువాకం

శ్రీ రుద్రం 2వ అనువాకం

మో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం పత’యేమో
బాహువులకు బంగారు ఆభరణములను ధరించునట్టియు, యుద్ధరంగములందు సేనానాయకుడైనట్టియు, దిక్కులను పాలించునట్టి రుద్రునకు నమస్కారమగుగాక.

నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యేమో
హరిత వర్ణ కేశములుగల వృక్షాకార రుద్ర మూర్తులకు నమస్కారము. పశువులకు పాలకుడైన రుద్రునకు నమస్కారము.

నమః’ స్పిఞ్జ’రా త్విషీ’మతే పథీనాం పత’యేమో
లేత మావి చిగురు రంగు  కాంతితో ప్రకాసించువానికి (అనగా నిత్య యవ్వనుడు, వికారములచే తాకబడనివానికి) నమస్కారము;  సర్వ మార్గములకూ పాలకుడు అగు రుద్రునకు నమస్కారము.

నమో’ బభ్లుశాయ’ వివ్యాధినే‌உన్నా’నాం పత’యేమో
ఎద్దును వాహనముగా చేసుకుని దానిపై అధిరోహించువాడు, (అసురీ శక్తులను) పీడించువానికి నమస్కారము. జీవులకు అవసరమైన అన్నములకు ప్రభువై వానిని కాపాడువానికి నమస్కారము.

మో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యేమో
నల్లని కేశములు కలవానికి (అనగా ఎప్పటికీ పండని జుట్టు కలవాడు, లేదా మార్పు చెందనివానికి),  మంగళ ప్రయోజనమైన యజ్ఞోపవీతమును సదా ధరించువానికి నమస్కారములు. సుగుణసంపూర్ణులైన పురుషులకు ప్రభువైవుండురుద్రునకు నమస్సులు.
 
నమో’ వస్య’ హేత్యై జగ’తాం పత’యేమో
జీవుల సంసారమును (అజ్ఞానమును) భేధించువానికి నమస్కారములు. జగములన్నింటికీ ప్రభువైన వానికి నమస్కారము.
 
నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యేమో
ఎక్కుపెట్టిన బాణముకల్గిన ధనస్సుతో లోకములను రక్షిచుచున్న రుద్రునకు నమస్కారములు. (చేతనాచేతనములైన) శరీరములను, పుణ్యక్షేత్రములను పాలించుచున్న రుద్రునకు నమస్కారము.
 
నమః’ సూతాయాహం’త్యా వనా’నాం పత’యేమో
(అంతర్యామిగానుండి, ఈ శరీరమనెడి రధమును నడుపుచున్న) సారధికి నమస్కారము. శత్రువులెవ్వరిచే సంహరింప సాధ్యముకాని రుద్రునకు నమస్కారము. అరణ్యములన్నింటినీ పాలించు జగద్రక్షకునకు నమస్కారము.

మో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యేమో
ఎఱ్ఱటి వర్ణము కలిగినవాడు, సమస్తమునకు ప్రభువు అయిన రుద్రునకు నమస్కరించుచున్నాను. వృక్షములన్నింటికీ ప్రభువైనవానికి నమస్కరించుచున్నాను.

నమో’ న్త్రిణే’ వాణిజా కక్షా’ణాం పత’యేమో
మంత్రములన్నింటికీ ప్రభవైనవానికి, వేదములయొక్క సారమైనవానికి నమస్కారము ("రాజసభలో మంత్రిగాయుండి పరిపాలనాకుశలుడైనవానికి, వాణిజ్యముజేయువారందరికీ ప్రభువుగాయున్నవానికి నమస్కారము" అన్న అర్ధంకూడా కలదు.) వనములందలి గుల్మ లతాదులను పాలించువానికి నమస్కారములు.

నమో’ భున్తయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యేమో
పద్నాలుగు భువనములను సృజించి, వాటిని విస్తరింపజేయుచున్నవానికి నమస్కారము. తాను సృష్టించిన జీవకోటికి ఆధారమైన ధనమును వివిధ వస్తు స్వరూపమున తయారుచేయుచున్నవానికి నమస్కారము. సకల ఔషధములకు ప్రభువైయున్న రుద్రునకు నమస్కారము.

నమ’ చ్చైర్-ఘో’షాయాక్రన్దయ’తే పత్తీనాం పత’యేమో
యుధ్ధకాలమున శత్రువుల గుండెలు పగులునట్ట్లు మహోన్నత ధ్వనిచేయువానికి, అట్టి మహాట్టహాసముతో శత్రువులను విలపింపజేయు రుద్రునకు నమస్కారము. తన పక్షముననున్న పాదచారులైన యోధులను శత్రువుల బారినుండి సంరక్షించువానికి నమస్కారము.

నమః’ కృత్స్నవీతా ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’
సకల శత్రు సైన్యములను చుట్టుముట్టడించి యుండువానికి, పఱుగులిడుచున్న శత్రు సైన్యముల వెనుకనే పఱుగులిడుచుండు రుద్రునకు నమస్కారము. సాత్వికులై శరణాగతులైన వారిని తప్పక కాపాడుచుండువానికి నమస్కారము.

శ్రీ రుద్రం 3వ అనువాకం

శ్రీ రుద్రం 3వ అనువాకం

మః సహ’మానాయ నివ్యాధిన’ ఆవ్యాధినీ’నాం పత’యే నమో
(శత్రువులను) పరాజితులను చేయువాడు, వారిని తీవ్రముగా పీడించువాడు, అట్లా బాధించు సేనలకు పాలకుడు అయిన రుద్రునకు నమస్కారము.

నమః’ కకుభాయ’ నిఙ్గిణే” స్తేనానాం పత’యేమో
(సకల ప్రపంచమున) ప్రధానమైనవాడు, ఖడ్గమును చేత ధరించినవాడు, గుప్త చోరులకు నాయకుడునూ అయిన రుద్రునకు నమస్కారము.

నమో’ నిఙ్గిణ’ ఇషుధిమతే’ తస్క’రాణాం పత’యేమో
ధనుర్భాణములను చేత ధరించినవాడు, (పృష్ఠభాగమున కట్టబడిన) అమ్ములపొది కలవాడు, ప్రకట చోరులకు నాయకుడు అయిన రుద్రునకు నమస్కారము.

మో వఞ్చ’తే పరివఞ్చ’తే స్తాయూనాం పత’యేమో
మోసములు చేయువాడు, మోసగాళ్ళను సయితము మోసము చేయువాడు, అప్తులవలే నటించి తమ యజమానియొక్క సొమ్ము అపహరించువారికి నాయకుడు అయిన రుద్రునకు నమస్కారము.

నమో’ నిచేరవే’ పరిరాయార’ణ్యానాం పత’యేమో
నిరంతరమూ సంచారమే శీలముగా గలవాడునూ, మనుష్య సంచారము బహుళముగానుండు వీధులు మున్నగు చోట్ల (దొంగబుధ్ధితో) తిరుగుచుండువాడునూ, నిత్యము అరణ్యములందేయుండి అదారిన పోవువారి ద్రవ్యమును అపహరించువారికి ప్రభువు అయిన రుద్రునకు నమస్కారము.

నమః’ సృకావిభ్యో జిఘాగ్‍మ్’సద్భ్యో ముష్ణతాం పత’యేమో
తన శరీరమును వజ్రమువలే ధృడము కావించుకొని రక్షించుకొనువాడు, ఇతర ప్రాణులను సంహరింపదలచువాడు, తమ యజమానియొక్క ధాన్యములను అపహరిచు కృషికులకు (వ్యవసాయదారులకు) ప్రభువు అయిన రుద్రునకు నమస్కారము.

నమో’‌உసిద్భ్యోక్తఞ్చర’ద్భ్యః ప్రకృన్తానాం పత’యేమో
ఖడ్గమును చేతదాల్చిన చోరులు, రాత్రులందు సంచరించుచు వీదులయందు వెడలు ప్రాణులను బాధించువారు, ప్రజలను సంహరించి వారి వస్తువులను హరించువారికి ప్రభువైన రుద్రునకు నమస్కారము.

నమ’ ఉష్ణీషినే’ గిరిరాయ’ కులుఞ్చానాం పత’యేమో
గ్రామజనులవలే తలపాగాను ధరించి (అనగా చక్కటి దుస్తులను ధరించి) జనులమధ్య సంచరించు చోరులు, పర్వతమున సంచరిచుచు జనుల వస్త్రాదులను  హరించు చోరులు, భూమిని గృహ క్షేత్రాదులను అపహరించువారికి ప్రభువైన రుద్రునకు నమస్కారము.

ఇషు’మద్భ్యో ధన్వావిభ్య’శ్చ వోమో
బాణములు కల్గినట్టి మీకు నమస్కారములు. ధనస్సులు కల్గినట్టి మీకు నమస్కారము.

నమ’ ఆతన్-వానేభ్యః’ ప్రతిదధా’నేభ్యశ్చ వోమో
ధనస్సు త్రాటిని బిగించు (కట్టు) మీకు నమస్కారములు. ధనస్సునందు బాణములు సంధించు మీకు నమస్కారము.

నమ’ చ్ఛ’ద్భ్యో విసృజద్-భ్య’శ్చ వోమో
వింటి నారిని వెనుకకులాగు మీకు నమస్కారములు.  బాణములను విడుచు మీకు నమస్కారము.

నమో‌உస్స’ద్భ్యో విద్య’ద్-భ్యశ్చ వోమో
లక్ష్యమువరకును బాణములు విడుచునట్టి మీకు నమస్కారములు. (ఆ బాణములతో) లక్ష్యమును ఛ్ఛేధించు మీకు నమస్కారము.

ఆసీ’నేభ్యః శయా’నేభ్యశ్చ వోమో
కూర్చుండునట్టి మీకు నమస్కారము. నిద్రించునట్టి మీకు నమస్కారము.

నమః’ స్వద్భ్యో జాగ్ర’ద్-భ్యశ్చ వోమో
నిద్రించునట్టి మీకు నమస్కారము. మేల్కొనియుండునట్టి మీకు నమస్కారము.

స్తిష్ఠ’ద్భ్యో ధావ’ద్-భ్యశ్చ వోమో
నిలబడియున్న మీకు నమస్కారము. పఱుగెత్తుచున్నట్టి మీకు నమస్కారము.

నమః’ భాభ్యః’ భాప’తిభ్యశ్చ వోమో
సభలో (లేక సంఘములో) ప్రేక్షకులుగాయున్న మీకు నమస్కారములు. సభకు అధిపతియైన మీకు నమస్కారము.

మోశ్వేభ్యో‌உశ్వ’పతిభ్యశ్చ వో నమః’
తనదగు ధనము లేనివారైన (పేదవారైన) నీకు నమస్కారములు. పేదవారికి ప్రభువైన నీకు నమస్కారము.

శ్రీ రుద్రం 4వ అనువాకం

శ్రీ రుద్రం 4వ అనువాకం

నమ’ ఆవ్యాధినీ”భ్యో వివిధ్య’న్తీభ్యశ్చ వోమో 
సంపూర్ణముగా వేధించుటకు (పీడించుటకు) సమర్ధులైన స్త్రీలగు మీకు నమస్కారము. విశేషముగా పీడించుటకు సమర్ధులైన స్త్రీలగు మీకు నమస్కారము.

ఉగ’ణాభ్యస్తృగం-తీభ్యశ్చ’ వోమో 
ఉత్కృష్ఠ గుణరూపలైన సప్త మాతృకలు మున్నగు దేవతా స్త్రీలకు నమస్కారము. (దుర్మార్గులైన రాక్షసాదులను) హింసింప సమర్ధులైన భయంకర దేవతలకును నమస్కారము.

నమో’ గృత్సేభ్యో’ గృత్సప’తిభ్యశ్చ వోమో 
విషయాసక్తులగు మీకు నమస్కారము. విషయ వాంఛలను జయించిన మీకు నమస్కారము.

మో వ్రాతే”భ్యో వ్రాత’పతిభ్యశ్చ వోమో
నానాజాతుల సంఘముల రూపము ధరించిన మీకు నమస్కారము. ఆ సంఘములకు అధిపతులైన మీకు నమస్కారము.

నమో’ ణేభ్యో’ ణప’తిభ్యశ్చ వోమో 
వివిధ దేవగణములుగా అయిన తమకు నమస్కారము. ఆ గణములకు అధిపతి అయిన తమకు నమస్కారము.

మో విరూ’పేభ్యో విశ్వరూ’పేభ్యశ్చ వోమో 
వికృతమైన రూపమును దాల్చిన తమకు నమస్కారము. ఈ విశ్వమందలి సకల ప్రాణుల రూపమును దాల్చిన మీకు నమస్కారము.

నమో’ మద్భ్యః’, క్షుల్లకేభ్య’శ్చ వోమో 
గొప్ప వ్యక్తిత్వము కలవారుగానుండు మీకు నమస్కారము. హీనమైన స్వభాము కలిగినవారుగానుండు మీకు నమస్కారము.

నమో’ థిభ్యో‌உరథేభ్య’శ్చ వోమో
రథము మొదలగు వాహనములను కలిగియున్న మీకు నమస్కారము. రథములవంటి ఎట్టి వాహనములు లేని మీకు నమస్కారము.

మో రథే”భ్యో రథ’పతిభ్యశ్చ వోమో 
రథరూపులగు మీకు నమస్కారము. రథములకు ప్రభువైనట్టి మీకు నమస్కారము.

నమః’ సేనా”భ్యః సేనానిభ్య’శ్చ వోమో
సేనల రూపమును ధరించిన మీకు నమస్కారము. ఆ సేనలకు అధిపతియగు మీకు నమస్కారము.

నమః’, క్షత్తృభ్యః’ సఙ్గ్రహీతృభ్య’శ్చ వోమో 
రథ శిక్షకులగు మీకు నమస్కారము. రథములను గ్రహించు సారథులగు మీకు నమస్కారము.

స్తక్ష’భ్యో రథకారేభ్య’శ్చ వో నమో’
దేవతారూప నిర్మాతలైన శిల్పులగు మీకు నమస్కారము. రథము మొదలగు వస్తువులను నిర్మించు శిల్పులగు మీకు నమస్కారము.

మః కులా’లేభ్యః ర్మారే”భ్యశ్చ వోమో 
కుంభకారులగు (కుమ్మరులు) మీకు నమస్కారము. లోహకారులగు మీకు నమస్కారము.

నమః’ పుఞ్జిష్టే”భ్యో నిషాదేభ్య’శ్చ వోమో 
పక్షుల గుంపులను సంహరించువారైన మీకు నమస్కారము. మత్స్యములను సంహరించువారైన మీకు నమస్కారము.

నమః’ ఇషుకృద్భ్యో’ ధన్వకృద్-భ్య’శ్చ వోమో 
శరములను తయారుజేయు మీకు నమస్కారము. ధనస్సులను తయారుజేయు మీకు నమస్కారము.

నమో’ మృయుభ్యః’ శ్వనిభ్య’శ్చ వోమో 
మృగములను చంపే వేటగాళ్ళయిన మీకు నమస్కారము. కుక్కల మెడలయందు కట్టబడిన తాళ్ళను చేతితో పట్టుకుని ఉన్న మీకు నమస్కారము.

మః శ్వభ్యః శ్వప’తిభ్యశ్చ వో నమః’ 
శునక (కుక్కల) రూపమును ధరించిన మీకు నమస్కారము. శునకములకు ప్రభువైన మీకు నమస్కారము.

శ్రీ రుద్రం 5వ అనువాకం

శ్రీ రుద్రం 5వ అనువాకం

నమో’ వాయ’ చ రుద్రాయ’  
ప్రాణులయుత్పత్తికి మూలకారణమైనవాడు, రుద్రునకు నమస్కారము.

నమః’ ర్వాయ’ చ పశుపత’యే  
పాపనాశకునకు,  పశుపతికి (అనగా: ఆజ్ఞానపు పాశములచే బంధింపబడిన జీవుల రక్షకునకు) నమస్కారము.

మో నీల’గ్రీవాయ చ శితికణ్ఠా’య  
కాలకూటవిష భక్షణముచే నీలమైన కంఠభాగము కలవాడును, మిగిలిన కంఠప్రదేశమున స్వేతవర్ణము కలవాడును అగు శివునకు నమస్కారము.

నమః’ కర్ధినే’ వ్యు’ప్తకేశాయ  
జటాజూటము కలవానికి, ముండిత కేశునకు (జుత్తు లేనివానికి) నమస్కారము.

నమః’ సహస్రాక్షాయ’ చ తధ’న్వనే  
అసంఖ్యాకములైన కన్నులు కలవాడును, వందలకొద్దీ ధనస్సులు కలవాడును అగు శివునకు నమస్కారము.

నమో’ గిరిశాయ’ చ శిపివిష్టాయ’  
కైలాసముననుండువాడును,  విష్ణువును తన హృదయమున ధరించువాడును అగు శివునకు నమస్కారము.

నమో’ మీఢుష్ట’మా చేషు’మతే  
అనుగ్రహమును వర్షించువాడును, బాణములను ధరించినవాడును అగు శివునకు నమస్కారము.

నమో” హ్రస్వాయ’ చ వానాయ’  
అల్ప ప్రమాణుడగుటచే హ్రస్వముగానున్నట్టి, సంకోచించిన అవయవములను కలిగియుండుటవలన వామనుడిగానున్నట్టి శివునకు నమస్కారము.

నమో’ బృతే వర్షీ’యసే  
ఆకారముచే ప్రౌఢుడైనట్టియును, గుణములచే సమృద్ధుడైనట్టి శివునకు నమస్కారము.

నమో’ వృద్ధాయ’ చ ంవృధ్వ’నే  
అందరికంటే వృద్ధుడును, వేదములచే స్తుతింపబడువాడును అగు శివునకునమస్కారము.

మో అగ్రి’యాయ చ ప్రమాయ’  
జగదుత్పత్తికి పూర్వమునుండీ ఉన్నట్టి, అందరిలో ముఖ్యుడును అగు శివునకు నమస్కారము.

నమ’ శవే’ చాజిరాయ’  
అంతటనూ వ్యాపించినట్టియు, గమన కుశలుడైనట్టి శివునకు నమస్కారము.

మః శీఘ్రి’యాయ శీభ్యా’య  
శ్రీఘ్రముగాబోవువాడునూ, నీటి ప్రవాహమున ఉన్నట్టి శివునకు నమస్కారము.

నమ’ ర్మ్యా’య చావస్వన్యా’య  
ప్రవాహ తరంగములందు (కెరటములందు) ఉన్నట్టియు, ధ్వనిరహితమైన స్థిరజలములందు ఉన్నట్టియును శివునకు నమస్కారము.

నమః’ స్త్రోస్యా’య ద్వీప్యా’య చ 
ప్రవాహముననున్నట్టియును, జల మధ్యస్థములైన ద్వీపములందున్నట్టి శివునకు నమస్కారము.

శ్రీ రుద్రం 6వ అనువాకం

శ్రీ రుద్రం 6వ అనువాకం

నమో” జ్యేష్ఠాయ’ చ కనిష్ఠాయ’  
అందఱికంటే జ్యేష్ఠుడు, అందరిలోకీ చిన్నవాడు అయినవానికి నమస్కారము.

నమః’ పూర్వజాయ’ చాపజాయ’
అన్నింటికంటే ముదు జన్మించినవానికి, జగత్తునందలి అన్నింటి తరువాత జన్మించినవానికి నమస్కారము.

నమో’ మధ్యమాయ’ చాపల్భాయ’
మధ్యలో జన్మించినవానికి, ఇంద్రియ పటుత్వము అధికముగాలేని బాలురరూపమున ఉద్భవించినవానికి నమస్కారము.

నమో’ జన్యా’య బుధ్ని’యాయ
తొడల మధ్యనుండి జన్మించినవానికి, (వృక్షాదుల) మూలములనుండి జన్మించినవానికి నమస్కారము.

నమః’ సోభ్యా’య చ ప్రతిర్యా’య
పుణ్య పాపములు రెండింటితోనూ కూడియున్నవానికి, (వివాహాది శుభకార్యములందు) రక్షాబంధనమును ధరించువానికి నమస్కారము.

మో యామ్యా’య క్షేమ్యా’య
యమునియొక్క లోకములుగా ప్రకటమైనవానికి, క్షేమకరములైనవాటియందు ఉన్నవానికి నమస్కారము.

నమ’ ఉర్వర్యా’య ఖల్యా’య
సర్వ సస్యములతో నిండిన భూములయందు ఉన్నవానికి, పంటలనుండి ధాన్యములను రాబట్టు (వేరుచేయు) ప్రదేశములందు ఉన్నవానికి నమస్కారము.

మః శ్లోక్యా’య చా‌உవసాన్యా’య
వేదములచే స్తుతింపబడుచున్నవానికి, ఉపనిషత్తులయొక్క సారమైనవానికి నమస్కారము.

మో వన్యా’య కక్ష్యా’య
వనములలో వృక్షాదులయందు ఉన్నవానికి, లతాదులయందు ఉన్నవానికి నమస్కారము.

నమః’ శ్రవాయ’ చ ప్రతిశ్రవాయ’
శబ్ద స్వరూపుడుగా ఉన్నవానికి, ఆ శబ్దముయొక్క ప్రతిధ్వని రూపుడుగా ఉన్నవానికి నమస్కారము.

నమ’ శుషే’ణాయ చాశుర’థాయ
వేగముగా పోవుచున్న సేనలయందు ఉన్నవానికి, వేగముగా పోవుచున్న రథములయందు ఉన్నవానికి నమస్కారము.

మః శూరా’య చావభిన్దతే
శూరుడైనవానికి, శత్రుసేనలను సంహరించువానికి నమస్కారము.

నమో’ ర్మిణే’ చ వరూధినే’
కవచమును కల్గియుండినవానికి, మంచి గృహమును కల్గియుండినవానికి నమస్కారము.

నమో’ బిల్మినే’ చ కచినే’
శిరోరక్షకమగు కిరీటమును ధరించినవానికి, శరీరరక్షకమగు కవచమును ధరించినవానికి నమస్కారము.

నమః’ శ్రుతాయ’ చ శ్రుతసే’నా
వేద ప్రసిద్ధుడైనవానికి, ప్రసిద్ధమైన సేనలు కలవానికి నమస్కారము.

శ్రీ రుద్రం 7వ అనువాకం

శ్రీ రుద్రం 7వ అనువాకం

నమో’ దుందుభ్యా’య చాహన్యా’య
భేరీనందు, భేరీని మ్రోగించుటకు ఉపయోగించు దండమునందు కలవానికి నమస్కారము.

నమో’ ధృష్ణవే’ చ ప్రమృశాయ’
యుద్ధమునందు ఎన్నడూ వెనుతిరగినివానికి, పర సైన్యముయొక్క రహస్యములను తెలుసుకొను గూఢచారికి నమస్కారము.

నమో’ దూతాయ’ చ ప్రహి’తాయ  
తన స్వామికి వృత్తాంతములను తెలియజేయుటలో కుశలుడైనవానికి, తన స్వామినుండి వర్తమానములను గొనిపోవువానికి నమస్కారము.

నమో’ నిఙ్గిణే’ చేషుధిమతే’
ఖడ్గమును ధరించినవానికి, బాణములకు ఆధారమైన అమ్ములపొదిని ధరించినవానికి నమస్కారము.

నమ’స్-తీక్ష్ణేష’వే చాయుధినే’
వాడియైన బాణములు కలవాడు, వివిధమైన ఆయుధములు కలవానికి నమస్కారము.

నమః’ స్వాయుధాయ’ చ సుధన్వ’నే
శోభనమైన ఆయుధము కలవానికి, శోభనమైన ధనస్సు కలవానికి నమస్కారము.

మః స్రుత్యా’య పథ్యా’య
పాదసంచారమునకు మాత్రమే యోగ్యమైన ఇరుకైన మార్గమున పోవువానికి, రధాశ్వాది సంచార యోగ్యమైన విశాల మార్గమున పోవువానికి నమస్కారము.

నమః’ కాట్యా’య చ నీప్యా’య
అల్పమైన జలప్రవాహముల రూపమున ఉన్నవానికి, పర్వతాగ్రములనుండి అధోముఖముగా పడి ప్రవహించుచున్న జలరూపమున ఉన్నవానికి నమస్కారము.

మః సూద్యా’య చ సస్యా’య  
బురదనేలలో జలరూపమున ఉన్నట్టివానికి, సరస్సున జలరూపమున ఉన్నట్టివానికి నమస్కారము.

నమో’ నాద్యాయ’ చ వైన్తాయ’  
నదీగత జలరూపుడైనట్టివానికి, అల్ప సరస్సులైన వేశంతములందు (కోనేరు) జలరూపమున ఉన్నవానికి నమస్కారము.

మః కూప్యా’య చాట్యా’య
బావులలోని జలరూపమున, గర్తములలోని (గోతులలోని) జలరూపమున ఉన్నవానికి నమస్కారము.

మో వర్ష్యా’య చార్ష్యాయ’  
వర్షజలరూపమున ఉన్నవానికి, వర్షేతరములైన సముద్రాది జలముల రూపమున ఉన్నవానికి నమస్కారము.

నమో’ మేఘ్యా’య చ విద్యుత్యా’య
మేఘమునందున్నట్టివానికి, మెఱుపు రూపములోనున్నవానికి నమస్కారము.

నమ ధ్రియా’య చాప్యా’య  
నిర్మలముగా ప్రకాసించు శరత్కాల మేఘమునందు (నిర్జలమైన మేఘము!), సూర్యుడు ప్రకాసించుచుండగా వర్షించుచున్న మేఘమునందు ఉన్నవానికి నమస్కారము.

మో వాత్యా’య రేష్మి’యాయ
పెనుగాలులతోకూడిన వర్షమునందును, ప్రళయకాలమున సంభవించు కుంభవృష్టియందును ఉన్నవానికి నమస్కారము.

నమో’ వాస్తవ్యా’య చ వాస్తుపాయ’ చ
సకల చరాచర వస్తువులయందునూ, గృహనిర్మాణమునకు అవసరమైన భూమిలో వాస్తుపురుషుని రూపమునందునూ ఉన్నవానికి నమస్కారము.

శ్రీ రుద్రం 8వ అనువాకం

శ్రీ రుద్రం 8వ అనువాకం

మః సోమా’య చ రుద్రాయ’
ఉమతో గూడియున్నట్టివానికి, సకల జీవుల దుఃఖములను నశింపజేయువానికి నమస్కారము.

నమ’స్తామ్రాయ’ చారుణాయ’
తామ్రవర్ణమున నుండువానికి, ఆపై అరుణవర్ణమున నుండువానికి నమస్కారము.

నమః’ ఙ్గాయ’ చ పశుపత’యే
జీవులకు సుఖములను చేకూర్చువానికి, భయహేతువులైన పాప రోగ చోరాదులనుండి రక్షించువానికి నమస్కారము.

నమ’ గ్రాయ’ చ భీమాయ’
ఉగ్రరూపమున నుండువానికి, చూచిన మాత్రముననే భయమును కల్గించువానికి నమస్కారము.

నమో’ అగ్రేధాయ’ చ దూరేధాయ’
ఎదురుగానుండి జరుపు వధకు, దూరమునుండే జరుపు వధకును నమస్కారము.

నమో’ న్త్రే హనీ’యసే
సంహరించువానికి, సర్వులనూ సంహరించువానికి నమస్కారము.

నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యో
పచ్చని ఆకులను కేశములుగా కలిగియున్న వృక్షముల రూపమున నున్నవానికి నమస్కారము.

నమ’స్తారా
తరింపజేయువానికి నమస్కారము.

నమ’శ్శమ్భవే’ చ మయోభవే’
ఈ లోకమునందు ఆనందమునకు కారణమైనవానికి, పరలోకములందు ఆనందమునకు కారణమైనవానికి నమస్కారము.

నమః’ శంరాయ’ చ మయస్కరాయ’
విషయ సుఖమును చేకూర్చువానికి, మోక్ష సుఖమును చేకూర్చువానికి నమస్కారము.

నమః’ శివాయ’ చ శివత’రాయ
కళ్యాణ స్వరూపుడైనట్టివానికి, మిగిలిన అన్నింటికంటే అత్యంత కళ్యాణ స్వరూపుడైనట్టివానికి నమస్కారము.

స్తీర్థ్యా’య కూల్యా’య
తీర్థములందు నెలకొనియున్నవానికి, నదీతీరములయందు నెలకొనియున్నవానికి నమస్కారము.

నమః’ పార్యా’య చావార్యా’య
ఆవలి ఒడ్డున ఉన్నవానికి, ఇవతలి ఒడ్డున ఉన్నవానికి నమస్కారము.

నమః’ ప్రతర’ణాయ చోత్తర’ణాయ
పాపములను నశింపజేసుకొనుటకు హేతువైనట్టివానికి, ముక్తిని పొందుటకు హేతువైనట్టివానికి నమస్కారము.

నమ’ ఆతార్యా’య చాలాద్యా’య
మరలా మరలా జన్మించుచున్నవానికి, జీవుల రూపములో కర్మ ఫలములను అనుభవించుచున్నవానికి నమస్కారము.

మః శష్ప్యా’య ఫేన్యా’య
నదీతీరమునందలి దర్భలు మొదలగు బాలతృణములందున్నవానికి, నదీజలముల రాపిడిచే ఏర్పడు నురుగనందున్నవానికి నమస్కారము.

నమః’ సిత్యా’య చ ప్రవాహ్యా’య చ
ఇసుకనందున్నవానికి, నీటి ప్రవాహమునందున్నవానికి నమస్కారము.

శ్రీ రుద్రం 9వ అనువాకం

శ్రీ రుద్రం 9వ అనువాకం

నమ’ ఇరిణ్యా’య చ ప్రథ్యా’య
చవిటినేలయందు ఉన్నవానికి, పదిమంది నడుచునట్టి త్రోవలో ఉన్నవానికి నమస్కారము.

నమః’ కిగ్ంశిలాయ’ క్షయ’ణాయ
రాళ్ళతో నిండిన (నివాసయోగ్యముకాని) ప్రదేశములందున్నవానికి, నివాసయోగ్యమైన ప్రదేశములందున్నవానికి నమస్కారము.

నమః’ కర్దినే’ పుస్తయే’
జటాజూటము కలిగియున్నవానికి, తన భక్తుల ఎదుట ఎల్లప్పుడూ ఉండునట్టివానికి నమస్కారము.

మో గోష్ఠ్యా’య గృహ్యా’య
గోశాలలలోనుండునట్టివానికి, సామాన్య గృహములందు ఉండునట్టివానికి నమస్కారము.

స్-తల్ప్యా’య గేహ్యా’య
సామాన్యులవలే తల్పము (మంచము)నందు శయనించువానికి, ధనవంతులవలే మహాప్రాసాదములందు ఉండువానికి నమస్కారము.

నమః’ కాట్యా’య చ గహ్వరేష్ఠాయ’
ముండ్లతోనిండి ప్రవేశింపనలవికాని ప్రదేశములందు ఉండువానికి, పర్వత గుహలయందుండువానికి నమస్కారము.

నమో” హృయ్యా’య చ నివేష్ప్యా’య
అగాధ జలములందుండువానికి, నీహార (మంచు) జలములందుండువానికి నమస్కారము.

నమః’ పాగ్‍మ్ వ్యా’య చ రస్యా’య
పరమాణువులయందు ఉన్నవానికి, ధూళి కణములలో సైతము ఉన్నవానికి నమస్కారము.

మః శుష్క్యా’య చ హరిత్యా’య
ఎండిపోయి ఉన్నవాటియందు (కఱ్ఱలు మొదలైనవి) ఉన్నవానికి, పచ్చనివాటియందు ఉన్నవానికి నమస్కారము.

మో లోప్యా’య చోప్యా’య
తృణాదికములు లేని కఠిన నేలలయందును, రెల్లుగడ్డి మొదలగు తృణములందును ఉన్నవానికి నమస్కారము.

నమ’ ర్మ్యా’య చ సూర్మ్యా’య
భూమియందునూ, చక్కని కెరటములుగల నదులయందునూ ఉన్నవానికి నమస్కారము.

నమః’ ర్ణ్యాయ చ పర్ణద్యా’య
నవనవలాడుచున్న పచ్చని ఆకులయందున్నవానికి, ఎండుటాకుల కుప్పలయందున్నవానికి నమస్కారము.

నమో’‌உపగురమా’ణాయ చాభిఘ్నతే
ప్రయోగించుటకు సిద్ధముగానున్న ఆయుధములను ధరించియున్నవానికి, సంపూర్ణముగా సంహరించునట్టివానికి నమస్కారము.

నమ’ ఆఖ్ఖితే ప్రఖ్ఖితే
కొద్దిపాటి దుఃఖమును కల్గించువానికి, మిక్కుటమగు దుఃఖమును కల్గించువానికి నమస్కారము.

నమో’ వః కిరికేభ్యో’ దేవానాగ్ం హృద’యేభ్యో
భక్తులకు సర్వ సంపదలను ప్రసాదించువానికి, సర్వ దేవతల హృదయమైనవానికి నమస్కారము.

నమో’ విక్షీకేభ్యో
"క్షీణించుట" అను గుణము లేనివానికి నమస్కారము.

నమో’ విచిన్వత్-కేభ్యో
వివేచనచేసి భక్తులు ఆపేక్షించువాటిని యొసంగువానికి నమస్కారము.

నమ’ ఆనిర్ తేభ్యో
సంపూర్ణముగా, నిశ్శేషముగా జీవుల పాపములను నశింపజేయువానికి నమస్కారము.

నమ’ ఆమీత్-కేభ్యః’
స్థూలంగా అనేకమైన భౌతిక రూపాలలో వ్యక్తమవుతున్నవానికి నమస్కారము.

శ్రీ రుద్రం 10వ అనువాకం

శ్రీ రుద్రం 10వ అనువాకం

ద్రాపే అన్ధ’సస్పతే దరి’ద్రన్-నీల’లోహిత |
షాం పురు’షాణామేషాం ప’శూనాం మా భేర్మా‌உరో మో ఏ’షాం కింనామ’మత్ |
పాపము చేయువారికి దుర్భరమైన గతిని కల్గించుచున్నవాడా, జీవులకు అన్నమును ప్రసాదించి రక్షించున్నవాడా, నీకోసమని ఏమీ దాచుకొననివాడా, నీలకంఠా, తక్కిన శరీరమునందంతా ఎఱ్ఱని వర్ణము కలవాడా, నీవు మా సాటి ప్రజలను, మా పశువులను భయపెట్టకుము. మేమెవ్వరమూ నశింపకుందుముగాక. ఎట్టి రోగములను పొందకుందుముగాక.

యా తే’ రుద్ర శివా నూః శివా విశ్వాహ’భేషజీ |
శివా రుద్రస్య’ భేజీ తయా’ నో మృడ జీవసే” |
ఓ రుద్రా! పరమమంగళకరముగా విలసిల్లుతున్న నీ శరీరము ఏదైతేయున్నదో ఆ స్వరూపము ఈ విశ్వమంతటికినీ ఔషధప్రాయమైయున్నది. ఆ పరమమంగళస్వరూపమే నీ ఘోరరూపమునకుకూడా ఔషధప్రాయముగానున్నది. అట్టి నీ పరమమంగళ రూపముతో మాకు సుఖములను కలుగజేయుము.

మాగ్‍మ్ రుద్రాయ’ వసే’ కర్దినే” క్షయద్వీ’రా ప్రభ’రామహే తిమ్ |
యథా’ నః శమస’ద్ ద్విదే చతు’ష్పదే విశ్వం’ పుష్టం గ్రామే’ స్మిన్ననా’తురమ్ |
రక్షణనొసగుటలో సమర్ధుడు, జటాజూటధారి, శత్రువులను క్షీణింపజేయువాడగు రుద్రునియందే మా బుద్ధిని ప్రవర్తింపజేయుదుము. ఆ రుద్రుడు మా తోటి స్త్రీ పురుషులకు, మా పశువులకు సుఖములను కలుగజేయుగాక; అంతేగాక మా గ్రామములకు, సకల ప్రాణులకూ పరిపుష్టిని కలిగించి, ఏ ఉపద్రవములు వాటిల్లకుండునట్లుగా చేయుగాక.

మృడా నో’ రుద్రోనో మయ’స్కృధి క్షయద్వీ’రా నమ’సా విధేమ తే |
యచ్ఛం యోశ్చ మను’రాజే పితా తద’శ్యా తవ’ రుద్ర ప్రణీ’తౌ |
ఓ రుద్రా! మాకు ఐహిక మరియు ఆముష్మిక సుఖములను చేకూర్చుము. (బాహ్య మరియు అంతః) శత్రువులను నశింపజేయువాడా, నమస్కారములతో నిన్ను పూజించి సేవించెదము. మా తండ్రియైన మనువు ఎట్టి ఆనందమును పొందియుండెనో, నీకు మాయందుగల వాత్సల్యముచే మేమునూ నీ మూలమున అట్టి ఆనందమునే పొందెదముగాక.

మా నో’ హాన్త’ముత మా నో’ అర్భకం మా ఉక్ష’న్తముత మా న’ ఉక్షితమ్ |
మా నో’‌உవధీః పిరం మోత మాతరం’ ప్రియా మా న’స్తనువో’ రుద్ర రీరిషః |
ఓ రుద్రా! మా కుటుంబములోని పెద్దవారిని, మా చిన్న పిల్లలను, సంతతిని కలుగజేయు యువకులను,  గర్భములలోనున్న శిశువులను, మా తండ్రిగారిని, మా తల్లిని, మరియు మాకు ప్రియమైనవారియొక్క శరీరములను హింసించకుము.

మా న’స్తోకే తన’యే మా ఆయు’షి మా నో గోషు మా నో అశ్వే’షు రీరిషః |
వీరాన్మా నో’ రుద్ర భామితో‌உవ’ధీర్-విష్మ’న్తో నమ’సా విధేమ తే |
ఓ రుద్రా! నీవు మా సంతానమును, మా పుత్రుని హింసింపకుము. మా ఆయుర్దాయమును తగ్గింపకుము. మా గోవులను, మా గుఱ్ఱములను హింసింపకుము. (అజ్ఞానమువల్ల మేము నీయెడల అమర్యాదతో ప్రవర్తించననూ) ఆగ్రహించి మా సైనికులను, మా సేవకులను హింసింపకుము. మేము హవిస్సులను సమర్పించుచు నమస్కారములతో నిన్ను సేవించెదము.

రాత్తే’ గోఘ్న త పూ’రుఘ్నే క్షయద్వీ’రాయ సుమ్-నస్మే తే’ అస్తు |
రక్షా’ చ నో అధి’ చ దేవ బ్రూహ్యథా’ చ నః శర్మ’ యచ్ఛ ద్విబర్హా”ః |
ఓ దేవా! గోవులను చంపునట్టిదియు, పుత్ర పౌత్రాది పురుషులను సంహరించునట్టిదియు, సేవకులను నశింపజేయునట్టిదియు అగు నీయొక్క ఉగ్రమైన రూపమును మానుండి దూరముగా ఉంచుము. సుఖకరమగు నీయొక్క రూపమును మాత్రమే మాపట్ల ఉపయోగించుము. మమ్ములను అన్నివిధములుగా రక్షించుము. (ఇతరులవద్ద) మాగూర్చి ఉదారముగా మాట్లాడుము. అంతేగాక నీవు మాకు రెండు లోకములందునూ సుఖమును ఒసంగుము.

స్తుహి శ్రుతం గ’ర్తదం యువా’నం మృగన్న భీమము’పన్తుముగ్రమ్ |
మృడా జ’రిత్రే రు’ద్ర స్తవా’నో న్యన్తే’ స్మన్నివ’పన్తు సేనా”ః |
(ఓ మనసా! సకల వేదములయందును) ప్రసిద్ధుడైయున్నట్టి పరమేశ్వరుని స్తుతించుము. గుహను పోలిన హృదయ పద్మమునందు సదా ఉండునట్టి, నిత్య యవ్వనుడైనట్టి, నశింపజేయు సమయమున సింహమువలే అతి భయంకరుడవు  ఉగ్రుడవు అగు ఓ రుద్రా, మా వచనములచే స్తుతించబడినవాడవై, మా శరీరములయందుండి మమ్ములను అనుగ్రహించుము. నానుండి అన్యముగానున్న వాటినన్నింటినీ నీ సేనలు నశింపజేయుగాక.

పరి’ణో రుద్రస్య’ హేతిర్-వృ’ణక్తు పరి’ త్వేషస్య’ దుర్మతి ర’ఘాయోః |
అవ’ స్థిరా ఘవ’ద్-భ్యస్-తనుష్వ మీఢ్-వ’స్తోకా తన’యాయ మృడయ |
ఓ రుద్రా! నీ ఆయుధమును, మరియు పాపులను దహించుటకు సిద్ధముగానున్న నీ క్రోధాగ్నిని మాపట్ల విడువకుము. హవిస్సులను అర్పించుచూ శరణాగతులైన భక్తుల కోర్కెలను విశేషముగా తీర్చువాడా, నీ క్రోధమును మానుండి దూరముగా మఱల్చుము. మా పుత్ర పౌత్రాదులను రక్షించి, వారికి సుఖము చేకూర్చుము.

మీఢు’ష్ట శివ’తమ శివో నః’ సుమనా’ భవ |
మే వృక్ష ఆయు’ధన్నిధా కృత్తిం వసా’ ఆచ’ పినా’కం బిభ్రదాగ’హి |
విశేషమైన అనుగ్రహమును వర్షించువాడా, పరమ మంగళకరమైన స్వరూపము కలవాడా, మాయెడల శాంత చిత్తుడవు, నిర్మల మనస్కుడవు కమ్ము. (వినాశనమును కల్గించు) నీ ఆయుధములను (మాకు దూరంగా) మహా వృక్షములపైనుంచుము. మావద్దకు వ్యాఘ్ర  చర్మమును ధరించి, పినాకమను ధనస్సును (అలంకారముగా) చేత ధరించి రమ్ము.

వికి’రి విలో’హి నమ’స్తే అస్తు భగవః |
యాస్తే’ హస్రగ్‍మ్’ హేయోన్యస్మన్-నిపన్తు తాః |
విశేషముగా వరములనిచ్చువాడా, తెల్లని రూపము కలవాడా, ఓ భగవంతుడా నీకు నమస్కారము. వేలకొలదిగా ఉన్న నీ ఆయుధములతో మానుండి వేరుగానున్నవాటిని నశింపజేయుము.

హస్రా’ణి సహస్రధా బా’హువోస్తవ’ హేతయః’ |
తాసామీశా’నో భగవః పరాచీనా ముఖా’ కృధి
ఓ భగవంతుడా, నీ చేతులయందు వేలాది రకములైన ఆయుధములు వేల సంఖ్యలో ఉన్నవి. వాటిపై స్వామిత్వముగల నీవు, దయతో వాటినన్నింటినీ మానుండి వెనుకకు త్రిప్పుము.

శ్రీ రుద్రం 11వ అనువాకం

శ్రీ రుద్రం 11వ అనువాకం

హస్రా’ణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యా”మ్ |
తేషాగ్‍మ్’ సహస్రయోనే‌உవధన్వా’ని తన్మసి |
(ఓ రుద్రా!) వేలకొలది సంఖ్యలో, వేలాది రకములైన రుద్రులు ఎవరైతే ఈ భూమండలముపై ఉన్నారో, ఆ రుద్రులయొక్క ధనస్సులకుగల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము.

స్మిన్-మ’త్-య’ర్ణవే”‌உన్తరి’క్షే వా అధి’ |
ఈ మహా సముద్రములయందు, అంతరిక్షమునందు (గల అసంఖ్యాక రుద్రులయొక్క ధనస్సుల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము).

నీల’గ్రీవాః శితికణ్ఠా”ః ర్వా ధః, క్ష’మారాః |
కంఠమునందు కొంతభాగము నీలిరంగులోనుండి, మిగిలిన భాగమంతయూ తెల్లని రంగులోనుండి, పాతాళమునందున్న (అసంఖ్యాక రుద్రులయొక్క ధనస్సుల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము.)

నీల’గ్రీవాః శితిణ్ఠా దివగ్‍మ్’ రుద్రా ఉప’శ్రితాః |
కంఠమునందు కొంతభాగము నీలిరంగులోనుండి, మిగిలిన భాగమంతయూ తెల్లని రంగులోనుండి,  స్వర్గమునందున్న (అసంఖ్యాక రుద్రులయొక్క ధనస్సుల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము.)

యే వృక్షేషు’ స్పిఞ్జ’రా నీల’గ్రీవా విలో’హితాః |
వృక్షములమీద లేతగడ్డి రంగులోనూ, నీల వర్ణములోనూ, రక్త వర్ణములోనూ ప్రకాసించుచున్న (అసంఖ్యాక రుద్రులయొక్క ధనస్సుల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము.)

యే భూతానామ్-అధి’పతయో విశిఖాసః’ కర్ది’నః |
సకల భూతములకు అధిపతులుగానూ, నున్నగా చేయబడిన శిరస్సులు కలవారుగానూ, జటాజూటములు గలవారుగానూ  ఉన్న (అసంఖ్యాక రుద్రులయొక్క ధనస్సుల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము.)

యే అన్నే’షు వివిధ్య’న్తి పాత్రే’షు పిబ’తో జనాన్’ |
అన్నము మొదలగు భక్ష్యములందును, పానీయములయందును ఉండి, వాటిని భుజించువారిని, త్రాగువారిని బాధించుచున్న (అసంఖ్యాక రుద్రులయొక్క ధనస్సుల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము.)

యే థాం ప’థిరక్ష’య ఐలబృదా’ వ్యుధః’ |
ఏ రుద్రులు (లౌకికములును, వైదికములను అగు) మార్గములను రక్షించుచున్నారో, ఏ రుద్రులు అన్న ప్రదానముచే జీవులను పోషించుచున్నారో, ఏ రుద్రులు శత్రువులతో యుద్ధముచేసి వారిని తరిమివేయుచున్నారో, (ఆ అసంఖ్యాక రుద్రులయొక్క ధనస్సుల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము.)

యే తీర్థాని’ ప్రచర’న్తి సృకావ’న్తో నిఙ్గిణః’ |
ఏ రుద్రులు తీర్థ క్షేత్రములందు (జనులను పీడించుటకై) కత్తులు ఈటెలు మొదలగు ఆయుధములను చేత ధరించి సంచరిస్తున్నారో (ఆ అసంఖ్యాక రుద్రులయొక్క ధనస్సుల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము.)

తావ’న్తశ్చ భూయాగ్‍మ్’సశ్చ దిశో’ రుద్రా వి’తస్థిరే |
తేషాగ్‍మ్’ సహస్రయోనే‌உవధన్వా’ని తన్మసి |
ఇప్పటివరకు ప్రస్తావించిన రుద్రులు మాత్రమేగాక, ఇంకా ఏ రుద్రులు అన్ని దిక్కులయందును ఉన్నారో, వారందరియొక్కధనస్సుల వింటిత్రాడులను తొలగించి, ఆ ధనస్సులను మానుండి వేలకొలది యోజనముల దూరములో ఉంచుము.

నమో’ రుధ్రేభ్యో యే పృ’థివ్యాం యే”‌உన్తరి’క్షే
యే దివి యేషాన్నం వాతో’ ర్-మిష’ 
స్-తేభ్యో ప్రాచీర్దశ’ దక్షిణా దశ’ ప్రతీచీ
ర్-దశో-దీ’చీర్-దశోర్ధ్వాస్-తేభ్యోస్తే నో’ మృడయన్తు 
తే యం ద్విష్మో యశ్చ’ నో ద్వేష్టి తం వో జమ్భే’ దధామి
ఏ రుద్రులు ఈ భూమిపై ఉండి అన్నమును తమ బాణములుగా కలిగియున్నరో, ఏ రుద్రులు ఆకాశమునందు ఉండి వాయువును తమ బాణములుగా కలిగియున్నారో, ఏ రుద్రులు స్వర్గమునందు ఉండి వర్షమును తమ బాణములుగా కలిగియున్నారో, ఆ రుద్రులందరికీ నమస్కారము. తూర్పు ముఖముగా - పది వేళ్ళ చివరలుగల అంజలలుతోడనూ (అనగా రెండు చేతులూ జోడించి), దక్షిణ ముఖముగా - పది వేళ్ళ చివరలుగల అంజలలుతోడనూ, పడమటి ముఖముగా - పది వేళ్ళ చివరలుగల అంజలలుతోడనూ, ఉత్తర ముఖముగా - పది వేళ్ళ చివరలుగల అంజలలుతోడనూ, ఊర్ధ్వ ముఖముగా - పది వేళ్ళ చివరలుగల అంజలలుతోడనూ, ఆ రుద్రులకు నమస్కారము. ఆ రుద్రులందరూ మమ్ములను సుఖపఱచుదురుగాక. మేము ఎవరిని ద్వేషింతుమో, మరియు మమ్ములను ఎవరు ద్వేషింతురో ఆ శత్రుద్వయమును, (ఓ రుద్రులారా) మీ తెఱచియున్న నోటిలో ఉంచుచున్నాము.

త్ర్యం’బకం యజామహే సున్ధిం పు’ష్టివర్ధ’నమ్ |
ర్వారుకమి’ బన్ధ’నాన్-మృత్యో’ర్-ముక్షీ మా‌உమృతా”త్ |
త్రినేత్రుడు, సుగంధములను వెదజల్లువాడు మరియు పరిపుష్టిని కల్గించుచువానిని (మేము) ఆరాధించెదము. (దోసతీగ తొడిమనుండి) బాగా ముగ్గిన దోసపండు విడివడు రీతిన మమ్ములను మృత్యువుయొక్క బంధనములనుండి విడిపించుము. అట్లే అమృతత్వమునుండి (ఆత్మ స్థితినుండి) మేము విడివడకుందుముగాక.

యో రుద్రో గ్నౌ యో ప్సు య ఓష’ధీషు యో రుద్రో విశ్వా భువ’నా వివే తస్మై’ రుద్రా నమో’ అస్తు |
ఏ రుద్రుడు అగ్నియందున్నాడో, ఏ రుద్రుడు జలమునందున్నాడో, ఏ రుద్రుడు ఓషధులయందున్నాడో, ఏ రుద్రుడు సకల భువనములయందు వ్యాపించియున్నాడో, అట్టి రుద్రునకు నమస్కారము.

తము’ ష్టుహి యః స్విషుః సున్వా యో విశ్వ’స్య క్షయ’తి భేజస్య’ |
యక్ష్వా”హే సౌ”మసాయ’ రుద్రం నమో”భిర్-దేవమసు’రం దువస్య |
ధృఢమైన ధనస్సును, శక్తివంతమైన బాణములను ధరించి భవరోగములను నశింపజేయు ఔషధమైయున్నవానిని స్తుతించుము. దైవము మరియు కష్టములను నశింపజేయువాడగు రుద్రుని ప్రశాంతమైన మనస్సు కొఱకై నమస్సులతో మేము పూజించుచున్నాము.

యం మేస్తో భగ’వాయం మే భగ’వత్తరః |
యం మే” విశ్వభే”షజో‌உయగ్‍మ్ శివాభి’మర్శనః |
శివపూజయందు శివలింగమును తాకుటచే ఈ నా హస్తము అత్యంత దివ్యమైనదిగా అగుగాక. అట్లు శివుని తాకుటచే, నా హస్తము ఈ విశ్వమునందలి సకలరోగములపాలిట ఔషధమగుగాక.

యే తే’ హస్ర’యుతం పాశా మృత్యో మర్త్యా’ హన్త’వే |
తాన్ ఙ్ఞస్య’ మాయార్వానవ’ యజామహే |
జీవులను నాశనమునకు కారణమైన వేలాది బంధనములన్నింటినీ శక్తిద్వారా నశింపజేయుము. అందులకై ఈ యజ్ఞము (అగ్నిహోత్రము) ద్వారా మేము మిమ్ములను పూజించున్నాము.

మృత్యవే స్వాహా’ మృత్యవే స్వాహా” |
ఈ హవిస్సు (మృత్యువు పాలిటి) మృత్యువైన రుద్రుని చేరుగాక. ఈ హవిస్సు రుద్రుని చేరుగాక.

ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యు’ర్మే పాహి ||
సర్వవ్యాపియైన భగవానుడగు రుద్రునకు నమస్కారము. నన్ను మృత్యువునుండి రక్షించుము.

ప్రాణానాం గ్రన్థిరసి రుద్రో మా’ విశాన్తకః |
తేనాన్నేనా”ప్యాస్వ |
నీవు మాలోని ప్రాణచలనమనెడి పగ్గములను పట్టి నడిపించున్నావు. ఓ రుద్రా! దయతో మృత్యువును మానుండి దూరముచేయుము. నేను అర్పించు ఈ ఆహారమును స్వీకరించి మాయందు పరిపూర్ణముగా ప్రకాశించుము.
 
ఓం శాంతిః శాంతిః శాన్తిః’

అర్పణ

 ఏతత్ సర్వం సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు.
 ఏతత్ సర్వం సద్గురు శ్రీ సాయినాధార్పణమస్తు.