శ్రీ రుద్రం 2వ అనువాకం
నమో హిర’ణ్య బాహవే సేనాన్యే’ దిశాం చ పత’యే నమో
బాహువులకు బంగారు ఆభరణములను ధరించునట్టియు, యుద్ధరంగములందు సేనానాయకుడైనట్టియు, దిక్కులను పాలించునట్టి రుద్రునకు నమస్కారమగుగాక.
నమో’ వృక్షేభ్యో హరి’కేశేభ్యః పశూనాం పత’యే నమో
హరిత వర్ణ కేశములుగల వృక్షాకార రుద్ర మూర్తులకు నమస్కారము. పశువులకు పాలకుడైన రుద్రునకు నమస్కారము.
నమః’ సస్పిఞ్జ’రాయ త్విషీ’మతే పథీనాం పత’యే నమో
లేత మావి చిగురు రంగు కాంతితో ప్రకాసించువానికి (అనగా నిత్య యవ్వనుడు, వికారములచే తాకబడనివానికి) నమస్కారము; సర్వ మార్గములకూ పాలకుడు అగు రుద్రునకు నమస్కారము.
నమో’ బభ్లుశాయ’ వివ్యాధినేஉన్నా’నాం పత’యే నమో
ఎద్దును వాహనముగా చేసుకుని దానిపై అధిరోహించువాడు, (అసురీ శక్తులను) పీడించువానికి నమస్కారము. జీవులకు అవసరమైన అన్నములకు ప్రభువై వానిని కాపాడువానికి నమస్కారము.
నమో హరి’కేశాయోపవీతినే’ పుష్టానాం పత’యే నమో
నల్లని కేశములు కలవానికి (అనగా ఎప్పటికీ పండని జుట్టు కలవాడు, లేదా మార్పు చెందనివానికి), మంగళ ప్రయోజనమైన యజ్ఞోపవీతమును సదా ధరించువానికి నమస్కారములు. సుగుణసంపూర్ణులైన పురుషులకు ప్రభువైవుండురుద్రునకు నమస్సులు.
నమో’ భవస్య’ హేత్యై జగ’తాం పత’యే నమో
జీవుల సంసారమును (అజ్ఞానమును) భేధించువానికి నమస్కారములు. జగములన్నింటికీ ప్రభువైన వానికి నమస్కారము.
నమో’ రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో
ఎక్కుపెట్టిన బాణముకల్గిన ధనస్సుతో లోకములను రక్షిచుచున్న రుద్రునకు నమస్కారములు. (చేతనాచేతనములైన) శరీరములను, పుణ్యక్షేత్రములను పాలించుచున్న రుద్రునకు నమస్కారము.
నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో
(అంతర్యామిగానుండి, ఈ శరీరమనెడి రధమును నడుపుచున్న) సారధికి నమస్కారము. శత్రువులెవ్వరిచే సంహరింప సాధ్యముకాని రుద్రునకు నమస్కారము. అరణ్యములన్నింటినీ పాలించు జగద్రక్షకునకు నమస్కారము.
నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో
ఎఱ్ఱటి వర్ణము కలిగినవాడు, సమస్తమునకు ప్రభువు అయిన రుద్రునకు నమస్కరించుచున్నాను. వృక్షములన్నింటికీ ప్రభువైనవానికి నమస్కరించుచున్నాను.
నమో’ మన్త్రిణే’ వాణిజాయ కక్షా’ణాం పత’యే నమో
మంత్రములన్నింటికీ ప్రభవైనవానికి, వేదములయొక్క సారమైనవానికి నమస్కారము ("రాజసభలో మంత్రిగాయుండి పరిపాలనాకుశలుడైనవానికి, వాణిజ్యముజేయువారందరికీ ప్రభువుగాయున్నవానికి నమస్కారము" అన్న అర్ధంకూడా కలదు.) వనములందలి గుల్మ లతాదులను పాలించువానికి నమస్కారములు.
నమో’ భువన్తయే’ వారివస్కృతా-యౌష’ధీనాం పత’యే నమో
పద్నాలుగు భువనములను సృజించి, వాటిని విస్తరింపజేయుచున్నవానికి నమస్కారము. తాను సృష్టించిన జీవకోటికి ఆధారమైన ధనమును వివిధ వస్తు స్వరూపమున తయారుచేయుచున్నవానికి నమస్కారము. సకల ఔషధములకు ప్రభువైయున్న రుద్రునకు నమస్కారము.
నమ’ ఉచ్చైర్-ఘో’షాయాక్రన్దయ’తే పత్తీనాం పత’యే నమో
యుధ్ధకాలమున శత్రువుల గుండెలు పగులునట్ట్లు మహోన్నత ధ్వనిచేయువానికి, అట్టి మహాట్టహాసముతో శత్రువులను విలపింపజేయు రుద్రునకు నమస్కారము. తన పక్షముననున్న పాదచారులైన యోధులను శత్రువుల బారినుండి సంరక్షించువానికి నమస్కారము.
నమః’ కృత్స్నవీతాయ ధావ’తే సత్త్వ’నాం పత’యే నమః’
సకల శత్రు సైన్యములను చుట్టుముట్టడించి యుండువానికి, పఱుగులిడుచున్న శత్రు సైన్యముల వెనుకనే పఱుగులిడుచుండు రుద్రునకు నమస్కారము. సాత్వికులై శరణాగతులైన వారిని తప్పక కాపాడుచుండువానికి నమస్కారము.
No comments:
Post a Comment