శ్రీ రుద్రం 1వ అనువాకం
ఓం నమో భగవతే’ రుద్రాయ ||
రుద్ర భగవానునికి నమస్కారము. (ధుఃఖములను, పాపములను నశింపజేయు వానికి నా నమస్కారము.)
ఓం నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ ||
ఓం నమ’స్తే రుద్ర మన్యవ’ ఉతోత ఇష’వే నమః’ | నమ’స్తే అస్తు ధన్వ’నే బాహుభ్యా’ముత తే నమః’ ||
ఓ రుద్రా! నీ కోపమునకు (నా) నమస్కారము. నీ బాణములకు (నా) నమస్కారము. నీ ధనస్సుకు (నా) నమస్కారము. నీ యొక్క రెండు బాహువులకూ కూడా (నా) నమస్కారము.
యాత ఇషుః’ శివత’మా శివం బభూవ’ తే ధనుః’ | శివా శ’రవ్యా’ యా తవ తయా’ నో రుద్ర మృడయ ||
పరమ మంగళకరమైన నీ బాణము ఏదైతే ఉన్నదో, మంగళకరమైన నీ ధనస్సు ఏదైతే ఉన్నదో, మంగళకరమైన నీ అమ్ములపొది ఏదైతే ఉన్నదో, వాటన్నింటితోనూ, ఓ రుద్రా, మాకు ఆనందాన్ని ప్రసాదించుము.
యాతే’ రుద్ర శివా తనూరఘోరాஉపా’పకాశినీ | తయా’ నస్తనువా శన్త’మయా గిరి’శంతాభిచా’కశీహి ||
ఓ రుద్రా, మంగళకరమైన నీ శరీరం ఏదైతే ఉన్నదో, అఘోర రూపమైన (అహింసాత్మకమైన) మరియు ధుఃఖాన్ని కలిగించని నీ శరీరం ఏదైతే ఉన్నదో, ఆ అనందాన్ని ప్రసాదించే శరీరంతో మమ్ములను ఆశీర్వదించుము.
యామిషుం’ గిరిశంత హస్తే బిభర్ష్యస్త’వే | శివాం గి’రిత్ర తాం కు’రు మా హిగ్‍మ్’సీః పురు’షం జగ’త్||
ఓ రుద్రా! నీ చేతిలో ఉపయోగించడానికి (సిద్ధంగా) ఏదైతే బాణాన్ని ధరించియున్నావో, దానిని (కేవలం) మాకు శుభములను కలుగజేయుటకు ఉపయోగించుము. మనుష్యలకును, ఇతర జీవులకునూ కష్టములను కలిగించకుము.
శివేన వచ’సా త్వా గిరిశాచ్ఛా’వదామసి | యథా’ నః సర్వమిజ్జగ’దయక్ష్మగ్మ్ సుమనా అస’త్ ||
ఓ రుద్రా! నిన్ను పొందుటకు, మంగళకరమైన వాక్కులతో నిన్ను ప్రార్ధించుచున్నాము. (నీ వలన) ఈ జగత్తు అంతయూ రోగ రహితముగనూ, మంచి మనస్సుతో కూడినదియునూ అగుగాక.
అధ్య’వోచదధివక్తా ప్ర’థమో దైవ్యో’ భిషక్ | అహీగ్’శ్చ సర్వాం”జమ్భయన్త్సర్వా”శ్చ యాతుధాన్యః’ ||
అందరిలో ప్రథముడవైన దైవము, వైద్యుడవు అయిన నీవు మా తరఫున ఉదారముగా మాట్లాడుము. సర్పములు, రాక్షసులు మొదలగు వానిని నశింపజేయుము.
అసౌ యస్తామ్రో అ’రుణ ఉత బభ్రుః సు’మఙ్గళః’ | యే చేమాగ్‍మ్ రుద్రా అభితో’ దిక్షు శ్రితాః స’హస్రశోஉవైషాగ్ం హేడ’ ఈమహే ||
ఏ రుద్రుడు, ఉదయ కాలమున తామ్ర వర్ణముతోనూ, ఆపై అరుణ వర్ణముతోనూ, ఆ తరువాత పింగళ వర్ణముతోనూ ఉన్న సూర్యునిగా ప్రకాశిస్తూ సర్వ మంగళములను కలిగించుచున్నాడో; సహస్ర సంఖ్యాకులైన ఏ రుద్రులు భూమండలముయొక్క అన్ని దిక్కులయందునూ వ్యాపించియున్నారో, వారు తమ తీక్షణతను (మాయందు) ఉపసంహరించుకోమని ప్రార్ధించుచున్నాను.
అసౌ యో’உవసర్ప’తి నీల’గ్రీవో విలో’హితః | ఉతైనం’ గోపా అ’దృశన్-నదృ’శన్-నుదహార్యః’ | ఉతైనం విశ్వా’ భూతాని స దృష్టో మృ’డయాతి నః |
నీలకంఠుడు అయిన రుద్రుడు రక్త వర్ణాన్ని కలిగిన కాల స్వరూపుడైన సూర్యునిగా ప్రకటమగుచున్నాడు. అలా వ్యక్తమైన రుద్రుడు పశువులను కాచుకొను గోపాలులచే, నదులనుండి నీటిని గొనివచ్చు స్త్రీలచే, మరియు సర్వ జీవులచే చూడబడుతున్నాడు. ఆ రుద్రుడు మమ్ములనందరినీ సుఖవంతులను గావించుగాక.
నమో’ అస్తు నీల’గ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే” | అథో యే అ’స్య సత్వా’నోஉహం తేభ్యో’உకరన్నమః’ ||
నీలకంఠుడూ, (ఇంద్ర రూప ధారణముచే) సహస్రాక్షుడూ, ప్రార్ధనలను నిరంతరమూ మన్నించువాడునూ అగు ఆ రుద్రునకు మా నమస్కారములు అందుగాక. అంతేగాక, రుద్రుని సేవకులందరందరకీ నేను నమస్కరించుచున్నాను.
ప్రముం’చ ధన్వ’నస్-త్వముభయోరార్త్ని’ యోర్జ్యామ్ | యాశ్చ తే హస్త ఇష’వః పరా తా భ’గవో వప | |
హే భగవాన్, మీ ధనస్సునకు రెండు వైపులా కట్టి ఉన్న ఆ వింటి త్రాటిని విప్పివేయుము. నీ చేతిలో (ప్రయోగించుటకు సిద్ధముగానున్న ఆ) బాణములను దూరముగా ఉంచుము.
అవతత్య ధనుస్త్వగ్మ్ సహ’స్రాక్ష శతే’షుధే | నిశీర్య’ శల్యానాం ముఖా’ శివో నః’ సుమనా’ భవ ||
సహస్రాక్షములను, వందలాది అమ్ములపొదులను కలిగియున్న ఓ రుద్రా! నీ యొక్క ధనస్సును క్రిందకు దించి, నీ బాణములయొక్క మొనలను మొద్దుబారినవిగా చేయుము. మాపట్ల మంగళకరుడవు, అనుగ్రహయుక్తుడవు కమ్ము.
విజ్యం ధనుః’ కపర్దినో విశ’ల్యో బాణ’వాగ్మ్ ఉత | అనే’శన్-నస్యేష’వ ఆభుర’స్య నిషఙ్గథిః’ ||
జటాజూటధారివగు ఓ రుద్రా, నీ దనస్సును వింటి త్రాడు లేనిదిగా చేయుము. అంతేగాక, నీ అమ్ములపొదిని బాణములు లేనిదానిగా చేయుము. బాణములను అసమర్ధములైన వానిగా చేయుము. నీ ఖడ్గపు ఒర కేవలము ఖడ్గమును మోయుటకు మాత్రమే పనికివచ్చునట్లు (కేవల అలంకార ప్రాయమైనదానిగా) చేయుము.
యా తే’ హేతిర్-మీ’డుష్టమ హస్తే’ బభూవ’ తే ధనుః’ | తయాஉస్మాన్, విశ్వతస్-త్వమ’యక్ష్మయా పరి’బ్భుజ ||
అందరి కోర్కెలను విశేషముగా తీర్చువాడవగు ఓ రుద్రా! నీ చేతులయందుగల ధనస్సు మొదలైన ఏ ఆయుధములైతే కలవో, వాని సహాయముతో మమ్ములను అన్నివిధములుగా, ఎట్టి ఉపద్రవములు వాటిల్లకుండా పరిరక్షించుము.
నమ’స్తే అస్త్వాయుధాయానా’తతాయ ధృష్ణవే” | ఉభాభ్యా’ముత తే నమో’ బాహుభ్యాం తవ ధన్వ’నే ||
స్వరూపముచేత చంప సమర్ధమైనట్టివి, (కానీ ఇప్పుడు) ధనస్సునందు సంధింపబడనివియగు నీ ఆయుధములకు నమస్కారములు. నీయొక్క బాహు ద్వయమునకు, మరియు నీ ధనస్సునకు సైతము నమస్కారము.
పరి’ తే ధన్వ’నో హేతిరస్మాన్-వృ’ణక్తు విశ్వతః’ | అథో య ఇ’షుధిస్తవారే అస్మన్నిధే’హి తమ్||
నీయొక్క ధనుర్భాణములు మమ్ములను అన్ని దిక్కులనుండి రక్షించుగాక, మరియు నీయొక్క అమ్ములపొదిని మానుండి దూరముగా ఉంచుము.
నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||
నమ’స్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ’ మహాదేవాయ’ త్ర్యమ్బకాయ’ త్రిపురాన్తకాయ’ త్రికాగ్నికాలాయ’ కాలాగ్నిరుద్రాయ’ నీలకణ్ఠాయ’ మృత్యుంజయాయ’ సర్వేశ్వ’రాయ’ సదాశివాయ’ శ్రీమన్-మహాదేవాయ నమః’ ||
విశ్వమంతటికీ ప్రభువు, దేవాధిదేవుడు, ముక్కంటి, మూడు పురములను నాశనము చేయువాడు, ప్రళయములో మూడు లోకాలను నశింపజేయు అగ్నిని హరించువాడు, కాలము అనే అగ్నినికూడా నశింపజేయువాడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు, సర్వులకు ప్రభువు, ఎల్లప్పుడూ మంగళములనే కలిగించువాడు అగు ఆ మహాదేవునకు నమస్కారము.
దయచేసి శ్రీరుద్రాధ్యాయం - చమకమ్ కూడా ఇలాగే అర్ధాలతో ప్రచురించి అందరినీ ధన్యుల్ని చేయ ప్రార్ధన - రమేష్ శర్మ్
ReplyDeleteరమేష్ శర్మగారు, మీ స్పందనకు, ప్రోత్సాహానికి హృదయపూర్వక ధన్యవాదములండి. మీకు ఈ అర్ధములు నచ్చినందుకు చాలా సంతోషము. మీరు సూచించినట్లే చమకముకూడా నేర్చుకోవడానికి, అర్ధములు వ్రాసుకోవడానికి భవిష్యత్తులో తప్పక ప్రయత్నిస్తాను. ఈలోపు మీరు ఈ క్రింది లింకువద్దగల పుస్తకములో ఆంగ్లములోగల అర్ధములు చూడగలరు.: http://www.scribd.com/Soham%20Hamsah/d/36551748-Rudra-Adhyaya
ReplyDeleteముఖ్యముగా, చమకము యొక్క ఆంతర్యమును(purpose) పై గ్రంధములో ఎంతో చక్కగా వివరించారు.
మీ ప్రోత్సాహమునకు అబినందనలు.
నమస్కారములతో,
సుబ్రహ్మణ్యం
nenu chala chotla vetikina taruvata, sivanugram che naku ee link dorikindi...
ReplyDeletepublish chesinavarandariki dhanyavadamulu